- సోమవారం నుంచి పనుల ప్రారంభం – ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యం
- షాపులు, గృహ యజమానులు సహకరించాలని ఆర్డీవో సరిత విజ్ఞప్తి
- మధ్యవర్తులకు చోటు లేదు.. జాప్యం లేకుండా పనులు పూర్తి చేస్తాం
- అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలతో ముందుకు ప్రభుత్వం
- విగ్రహాలకు పూర్తి గౌరవం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల
షాద్‌నగర్, జూలై 22 (చైతన్యగళం):
షాద్‌నగర్ పట్టణ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రధాన చౌరస్తా విస్తరణ పనులకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ట్రాఫిక్ రద్దీ, తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సోమవారం నుంచి చౌరస్తా విస్తరణ పనులను ప్రారంభించనున్నట్లు షాద్‌నగర్ ఆర్డీవో ఎన్.ఆర్. సరిత ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కుల సంఘాలు, జర్నలిస్టులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో చౌరస్తా విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు, అమలు విధానం, ప్రజల సహకారం, ట్రాఫిక్ నియంత్రణ, భవిష్యత్ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆర్డీవో సరిత మాట్లాడుతూ షాద్‌నగర్ చౌరస్తా ప్రస్తుతం పట్టణానికి ప్రధాన ట్రాఫిక్ కేంద్రంగా మారిందని, రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతుండటంతో ప్రమాదాల సంఖ్య కూడా అధికమవుతోందన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందిన విషాద ఘటన అందరినీ కలచివేసిందని గుర్తుచేస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చౌరస్తా విస్తరణ అత్యవసరమని పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె, రోడ్డు విస్తరణలో భాగంగా షాపులు, భవనాల యజమానులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి మధ్యవర్తిత్వం, సిఫార్సులు, ఒత్తిళ్లకు అవకాశం ఉండదని, పూర్తిగా పారదర్శకంగా పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో ప్రధాన చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల అంశం కూడా చర్చకు వచ్చింది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ విగ్రహాలను తాత్కాలికంగా గౌరవప్రదంగా మరోచోటికి తరలించి, రహదారి విస్తరణ అనంతరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన ప్రదేశంలో తిరిగి ఏర్పాటు చేస్తామని ఆర్డీవో తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ పట్ల తనకు అపార గౌరవం ఉందని, ఆయన రాజ్యాంగం, రిజర్వేషన్ వ్యవస్థ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
చౌరస్తాను సుమారు 100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేసి, నాలుగు వైపులా వాహనాల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మున్సిపల్ కమిషనర్ సునీతా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో ముందుకు రావాలని కోరారు.
ఎమ్మార్పీఎస్ నాయకుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ మాట్లాడుతూ చౌరస్తా విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, పనులు పూర్తయ్యాక అంబేద్కర్ విగ్రహాన్ని సెంట్రల్ చౌరస్తాలోనే పునఃప్రతిష్ఠించాలని కోరారు.
సీనియర్ జర్నలిస్ట్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి రహదారి విస్తరణకు ఇప్పటికే రూ.5.70 కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో ఆక్రమణలు తొలగించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. రహదారి విస్తరణలో భవన యజమానులకు నష్టం జరిగితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
చౌరస్తా విస్తరణ ఉద్యమకారుడు ఆర్ఎన్ రాము మాట్లాడుతూ …ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషకరమని, పనులు వేగంగా పూర్తిచేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.
ముఖ్యంగా, ఈ సమావేశం ద్వారా షాద్‌నగర్ ప్రధాన చౌరస్తా విస్తరణపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించడం, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించడం పట్టణ అభివృద్ధిలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ జిటి శ్రీనివాస్, ఒగ్గు కిషోర్, నక్కల వెంకటేష్ గౌడ్, కార్మిక సంఘం నాయకుడు పినపాక ప్రభాకర్, ప్రభుత్వ పలు శాఖల అధికారులు, తదితర నాయకులు పాల్గొన్నారు.
