పెద్దపల్లి, జూలై 21 (చైతన్య గళం):
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కేవలం మెదక్, గజ్వేల్ ప్రాంతాలకే తరలించిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మల్యాల, తారుపల్లి, మీర్జాంపేట, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల్లో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జిలు, మార్కెట్ భవనం, మహిళా భవనం, సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీ గోడలు వంటి నిర్మాణాలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఉమ్మడి జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్ ద్వారానే నీళ్లు అందుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎక్కడా ఇవ్వలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఏ ఊరికి, ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక రాగానే కాళేశ్వరాన్ని రిపేర్ చేసి, అవసరమైతే రీ-కన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం కృషి చేస్తుందని తెలిపారు.
ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు ముందుజాగ్రత్తగా పంటల మార్పిడి పాటించాలని సూచించారు. “నాలుగు ఎకరాలు ఉన్న రైతులు రెండు ఎకరాల్లో వరి వేసి, మిగతా భూమిలో కంది, నువ్వులు, వేరుశనగ వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. DAP కి బదులుగా సూపర్, నానో ఎరువులు వాడటం పంటలకు లాభదాయకమని సూచించారు.
అదనంగా, పెద్దరాతపల్లి గ్రామంలో హుజురాబాద్–జమ్మికుంట నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సు సేవలను ప్రారంభించారు. ఈ బస్సు మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, తహసిల్దార్ రాపెల్లి రాముడు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
