- డీఎంహెచ్‌వో పై మంత్రికి వైద్య సిబ్బంది ఫిర్యాదులు
- హెల్త్ సెక్రటరీకి ఫోన్ చేసిన దామోదర రాజనర్సింహ.. సమగ్ర నివేదికకు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 20(చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న పరిస్థితులపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆదివారం టీఎన్‌జీవో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, వైద్యులు, ఇతర ఉద్యోగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
జిల్లా డీఎంహెచ్‌వో డా. స్వర్ణకుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయ పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సిబ్బందితో వ్యవహరించే తీరు కారణంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వినతిపత్రంలో పేర్కొన్నారు. పలువురు వైద్యులు మానసిక ఒత్తిడికి గురయ్యారని, కొందరు రాజీనామా చేయగా, మరికొందరు దీర్ఘకాలిక సెలవులకు వెళ్లిన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీపీఎంయూ సిబ్బంది విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా వివరించారు.

జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని పలు కార్యక్రమాల అమలు ప్రభావితమవుతోందని, బస్తీ దవాఖానా సిబ్బంది వేతనాలు, ఈసీ-ఏఎన్‌ఎంల జీతాలు, ఆశా కార్యకర్తల హానరేరియం, టీబీ రోగుల నిక్షయ్ పోషణ డీబీటీ, ఆర్‌బీఎస్‌కే సేవలు, పల్స్ పోలియో బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. కొండాపూర్ ల్యాబ్ సేవల నిర్వహణపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
వినతిపత్రాన్ని పరిశీలించిన మంత్రి డా. దామోదర రాజనర్సింహ వెంటనే హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు. ప్రజారోగ్య సేవలకు అంతరాయం కలిగించే అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించినట్లు వెల్లడించారు.
తమ సమస్యలను వెంటనే పరిశీలించి స్పందించిన మంత్రికి జిల్లా వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్యాదులపై నిష్పాక్షిక విచారణ జరిపి, జిల్లా వైద్య సేవలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన పరిపాలనా చర్యలు చేపట్టాలని, వినతిపత్రంలో ప్రస్తావించిన అంశాలను అత్యవసరంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
