కరీంనగర్, జూలై 18 (చైతన్యగళం):
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఆటోవాలాగా మారి కరీంనగర్ వీధుల్లో స్వయంగా ఆటో నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన నివాసం నుండి బయలుదేరిన ఆయన, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, హిందుత్వ నినాదాలను ప్రచారం చేస్తున్న ఆటో డ్రైవర్ భరత్తో కలిసి దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఆటో నడిపారు.
జ్యోతినగర్, మంకమ్మతోట, గీతాభవన్ చౌరస్తా, ప్రతిమ చౌరస్తా, బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బోయవాడ మీదుగా లక్ష్మీనగర్ చేరుకున్న అనంతరం, భరత్‌కు కొత్త ఆటోను బహూకరించారు.

వనపర్తి జిల్లాకు చెందిన చంచరి భరత్ కుమార్ (24) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన ఆటో వెనుక భాగంలో హిందుత్వ నినాదాలను రాయించుకోవడంతో ఇటీవల కొందరు యువకులు అతనిపై దాడి చేసి ఆటో వెనుక కవర్‌ను చించివేశారు. ఈ ఘటనను భరత్ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్‌కు వివరించగా, మంత్రి అతనికి ధైర్యం చెప్పి కొత్త ఆటోను అందజేయాలని హామీ ఇచ్చారు.
“హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్మి ధైర్యంగా నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న భరత్ లాంటి యువకులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
