Saturday, August 29, 2026
Homeసంపాదకీయంమంథనిలో న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.20 కోట్ల మంజూరు

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.20 కోట్ల మంజూరు

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, జులై 18 (చైతన్య గళం):
మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల (టీఆర్‌&బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ రంగానికి అవసరమైన అత్యుత్తమ మానవ వనరుల్ని తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకునేలా అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ఇక్కడ లభించనుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణార్థులకు స్వయం ఉపాధితో పాటు ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక న్యాక్ సెంటర్ ను మంథనికి కేటాయించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మాణ రంగంలో ఉత్తర తెలంగాణ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణను అందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా ఈ కేంద్రం వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!