కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం):
రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు నూతన గోదాములు, షెడ్ల నిర్మాణం కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరుతూ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆమె ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, కాటన్ మార్కెట్ యార్డు, గ్రెయిన్స్ మార్కెట్ యార్డు, ఫ్రూట్ మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలం రైతుల అవసరాలకు సరిపోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు రెండు ఎకరాల భూమిని మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించడంతో పాటు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఓపెన్ షెడ్లను వినియోగంలోకి ఇవ్వడంతో మార్కెట్ యార్డులో స్థలాభావం ఏర్పడిందని వివరించారు.
ధాన్యం, పత్తి, మామిడి తదితర వ్యవసాయ ఉత్పత్తులను విక్రయానికి తీసుకువచ్చే రైతులకు తగిన గోదాములు, షెడ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పంటలను భద్రంగా నిల్వ చేయడంతో పాటు మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం మార్కెట్ కమిటీ పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు.
ఈ అంశంపై ఈ నెల 12న నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశంలో సభ్యులు సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ భూమి కేటాయింపునకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా భూమి కేటాయింపు అంశాన్ని సమగ్రంగా పరిశీలించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం పట్ల మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేణి సంపత్, కాసవేణి భూమయ్య, మాలోతు మాలతి, శివనాధుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
