Tuesday, July 7, 2026
Homeతెలంగాణజెడ్పీహెచ్‌ఎస్‌కు వెంటనే నూతన భవనాలు మంజూరు చేయాలి

జెడ్పీహెచ్‌ఎస్‌కు వెంటనే నూతన భవనాలు మంజూరు చేయాలి

📰 Generate e-Paper Clip

మర్రిగూడ, జూలై 6 (చైతన్యగళం):
మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (జెడ్పీహెచ్‌ఎస్)లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత విద్యార్థుల విద్యాభ్యాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని, వెంటనే నూతన పాఠశాల భవనాలు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలను సమగ్రంగా పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను గుర్తించారు. తరగతి గదులు లేక వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూనిఫారాలు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

తాగునీటి సౌకర్యం సక్రమంగా లేకపోవడం, మరుగుదొడ్లు నీటి వసతి లేక వినియోగానికి నోచుకోవడం, మధ్యాహ్న భోజన పథకానికి శాశ్వత వంటగది లేక వర్షం వచ్చినప్పుడు వంట నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్వీపర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిశుభ్రత దెబ్బతింటోందని, కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్ల విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా పాఠశాలను సందర్శించి, నూతన భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వంటగది, కంప్యూటర్ల మరమ్మతు, ఖాళీ పోస్టుల భర్తీ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రూప్ సింగ్ రాథోడ్, ఉపాధ్యాయులు, సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు, మైల సత్తయ్య, శిరసనవాడ గణేష్, ఏరుకొండ రాఘవేందర్, విద్యార్థినీ‑విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!