మహబూబాబాద్, జూలై 3(చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి–భూముల రీ సర్వే కార్యక్రమం ద్వారా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాసులు తెలిపారు.
శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు భూముల రీ సర్వేపై గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
రీ సర్వే ద్వారా ప్రతి భూమికి ఖచ్చితమైన సర్వే నంబర్, ల్యాండ్ పార్సెల్ మ్యాప్ నమోదు చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. గతంలో సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలకు చెక్ పెట్టి ప్రతి భూమికి భూధార్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సర్వే జరిగే సమయంలో రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని కోరారు. గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, రహదారులు తదితర ప్రజా అవసరాల భూములను కూడా శాస్త్రీయంగా రీ సర్వే చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
