హుస్నాబాద్, జూన్ 25 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని అమరుల స్థూపం పరిసర భూముల కబ్జాపై జేఏసీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సర్వే నంబర్ 1189లోని చారిత్రాత్మక స్థూపం భూమి అధికార అండతో అన్యాక్రాంతం అవుతోందని ఆరోపించారు.
పీపుల్స్ వార్ ఉద్యమ అమరుల స్మారకార్థం నిర్మించిన 88 అడుగుల స్థూపం పరిసర భూములు ప్రజల వారసత్వ సంపదగా నిలిచాయని పేర్కొంటూ, స్థూపం పునర్నిర్మాణం, స్మృతి వనం ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థూపం ఆవరణలో కొనసాగుతున్న అనుమతి లేని నిర్మాణాలను వెంటనే తొలగించాలని, సర్వే నంబర్ 1189/బికి సంబంధించిన భూ రికార్డులను బహిరంగపరచాలని కోరారు.
భూదాన్ భూముల హక్కులు, పట్టాల మార్పులు, నిర్మాణ అనుమతులపై సమగ్ర విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. చరిత్రను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. గద్దర్ స్మారక ట్రస్ట్ ఏర్పాటు చేసి స్మృతి వనం, ఆడిటోరియం నిర్మించాలని సూచించారు. హుస్నాబాద్ అమరుల స్థూపం స్థల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కో-కన్వీనర్లు మేకల వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్న రాజు, పట్టణ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ, కౌన్సిలర్లు గాదపాక రవీందర్, కేశవేణి రమేష్, అఖిలపక్ష నాయకులు గడిపె మల్లేష్, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బత్తుల చంద్రమౌళి, కోయ్యడ కొమురయ్య, జేఏసీ నాయకులు మోహన్ రెడ్డి, వడ్డేపల్లి చంద్రమౌళి, అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
