వెల్దండ, జూన్ 10 (చైతన్యగళం):స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెర్కూర్ గ్రామంలో వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి నిర్వహించే విధానంపై అవగాహన కార్యక్రమం, గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ పరిశుభ్రత మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా వ్యర్థాల వేరు చేసే విధానాన్ని పాటించాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే ఇందిరమ్మ ఇండ్లు పథకంలో పైలెట్ గ్రామంగా చేర్కూర్ ఎంపికై, 98 మందిని లబ్ధిదారులుగా గుర్తించి మంజూరి పత్రాలు అందజేసిన తర్వాత కలెక్టర్ సంతకాలు లేవంటూ తిరిగి తీసుకోవడం ఏమిటని ఎంపీడీవో కృష్ణయ్యను ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీఓ లక్ష్మణ్, మండలాధికారులు, ఉపసర్పంచ్ కొండలు, వార్డు సభ్యులు వెంకటమ్మ, లక్ష్మి, రమేష్, కుమార్, పద్మ, పూజ, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
