యాచారం, జులై 20 (చైతన్యగళం) : ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో యూనిఫాంలు, పుస్తకాల దందా అరికట్టాలని యాచారం మండల ఎంఈవోకు వినతిపత్రం అందజేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన నేత ముత్యాల మనీష్ పటేల్ .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో యూనిఫాంలు, పుస్తకాల పేరుతో జరుగుతున్న అక్రమ దందాను అరికట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో)ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన అధ్యక్షుడు ముత్యాల మనీష్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం ఎంఈవో కార్యాలయంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపే విధంగా ఒకే దుకాణాల్లో యూనిఫాంలు, పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి అక్రమాలను అరికట్టి, విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని ఎంఈవోను కోరారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించడంతో పాటు తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఎంఈవో హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
