చిగురుమామిడి, జూలై 17 (చైతన్యగళం):
చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వ్యవసాయ భూములు, గ్రామ సరిహద్దులు, భూ రికార్డులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో శాలిని, ఎంఆర్ఓ కనకయ్య, ఆర్ఐ నాగరాజు, జీపీఓ రాంబులు, సర్వేయర్ బాలకృష్ణ తదితర అధికారులు రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ మాట్లాడుతూ, ఉల్లంపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూముల రీసర్వే చేపట్టడం గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వ్యవసాయ భూముల హద్దులు స్పష్టమై, గ్రామ సరిహద్దులు ఖరారవడంతో పాటు భూ వివాదాలు తగ్గి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో శాలిని, ఎంఆర్ఓ కనకయ్య, ఆర్ఐ నాగరాజు, జీపీఓ రాంబులు, సర్వేయర్ బాలకృష్ణతో పాటు సంబంధిత అధికారులందరికీ సర్పంచ్ అలువాల శంకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
