సిద్దిపేట, జూలై 11{చైతన్యగళం}:
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.
శనివారం అక్బర్‌పేట భూంపల్లి మండలం మోతే గ్రామంతో పాటు జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట్ల కాలనీ, శివాజీ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌మరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తైందని, బీఎల్‌వోల వారీగా ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని పేర్కొన్నారు
దేశంలో ప్రతి అర్హుడైన ఓటరుకు ఒకే చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నదే భారత ఎన్నికల సంఘం లక్ష్యమని, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు పూర్తిస్థాయిలో సహకరించాలని, బీఎల్‌వోలు అందజేసిన పత్రాలను సక్రమంగా నింపి డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారి వివరాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అనంతరం అక్బర్‌పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, సంబంధిత మండల తహసీల్దార్‌లు, అధికారులు పాల్గొన్నారు.
