- గట్టు ఇప్పలపల్లిలో ఏదుల శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు పొంగులేటి, వాకిటి – ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు, జూలై 8 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో అస్వస్థతకు గురై మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఏదుల శంకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన శంకర్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ నెల 4న మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభలో పాల్గొన్న ఏదుల శంకర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రులు, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తక్షణ సహాయంగా రూ.5 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ, శంకర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం సేవలందించిన నాయకుడి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
