మహబూబాబాద్, జూలై 3(చైతన్యగళం): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ నెల 18న నిర్వహించనున్న చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత పిలుపునిచ్చారు.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంకులు, చిట్‌ఫండ్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు తాము దాఖలు చేసిన చెక్కు బౌన్స్ కేసుల్లో రాజీకి ముందుకు రావాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ప్రత్యేక లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. సమయం, వ్యయం ఆదా కావడంతో పాటు వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదులు తమ కక్షిదారులకు అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా సహకరించాలని కోరారు.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం నమోదైన చెక్కు బౌన్స్ (చెల్లని చెక్కుల) కేసుల కోసం మహబూబాబాద్, తొర్రూర్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు.
