మంచిర్యాల, జూలై 5 (చైతన్యగళం): రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ఆదివారం భీమారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు అందిస్తున్నామని చెప్పారు.చెన్నూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ.36 కోట్లతో 56 కిలోమీటర్ల రహదారులు, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.63 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. భీమారం మండలంలో 6 కిలోమీటర్ల రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని, అమృత్ 2.0 పథకం క్రింద ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్ కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలో విద్యా రంగం అభివృద్ధి చెందుతోందని, ఈ సంవత్సరం 3 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు చేరారని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, భోజనశాలలు, ఆర్.ఓ. ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహాలను ప్రారంభించిన మంత్రి, రాష్ట్రంలో పెంకుటిల్లు లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
