నందికొట్కూరు, జూలై 3 (చైతన్యగళం): నందికొట్కూరు, పగిడ్యాల మండలాల్లోని లక్ష్మాపురం అంబేద్కర్ గురుకులం, అంగన్‌వాడీ కేంద్రాలు, కోటా హైస్కూల్, గర్ల్స్ స్కూల్, సివిల్ సప్లై గోడౌన్, మిడుతూరు మండలంలోని పలు కేంద్రాలను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పేద పిల్లలకు పెట్టే అన్నంలో కక్కుర్తి వద్దు, లంచాలకు ఆశపడొద్దు. వంట నాణ్యతలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. గురుకులాల్లో వంట సిబ్బంది ఎదుర్కొంటున్న జీతాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా, “అవసరానికి మించి బియ్యం స్టాక్ ఉంచడం వల్ల పురుగు పడుతోంది. ఎంత అవసరమో అంతే స్టాక్ తీసుకోవాలి. రేషన్ షాపులు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలు అన్నీ ఫుడ్ కమిషన్ పరిధిలోకి వస్తాయి.

లోపాలు జరిగితే సుమోటో కేసులు పెట్టే, ఫైన్లు వేసే, సస్పెండ్ చేసే అధికారాలు కమిషన్‌కు ఉన్నాయి” అని వివరించారు.నందికొట్కూరు మండలంలో ఎంఈఓలు నిర్లక్ష్యం చేస్తే పిల్లల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మంగవల్లి, ఎమ్మార్వో శ్రీనివాసులు, ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
