మహబూబాబాద్, జూన్ 25 (చైతన్యగళం): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన లంబాడీ, ఎరుకల, యానాది తెగల రిజర్వేషన్ స్వర్ణోత్సవాల వేడుకలకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరయ్యారు. అనంతరం ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో లంబాడీ సమాజం ఎస్టీ జాబితాలో చేరి నేటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ స్వర్ణోత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించడం ఆనందదాయకం. గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించి రాజ్యాంగబద్ధ హక్కులను అందించింది” అని పేర్కొన్నారు.
నేడు గిరిజన సమాజం సాధిస్తున్న ప్రగతికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే పునాది అని వారు స్పష్టం చేశారు. లంబాడీ, ఎరుకల, యానాది తెగల అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన సేవలను ఆయా సమాజాలు ఎన్నటికీ మరవవని, గిరిజనుల సంక్షేమం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు.
