Wednesday, June 24, 2026
Homeజాతియంకేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ!

కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ!

📰 Generate e-Paper Clip

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ క్యాబినెట్‌లో భారీ మార్పులు?

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని భేటీ
  • కేంద్ర సహాయ మంత్రి కురియన్‌ రాజీనామా
  • 21న ముగిసిన కురియన్‌ రాజ్యసభ పదవీకాలం
  • మరో మంత్రి రవనీత్‌సింగ్‌కూ దక్కని రెన్యువల్‌
  • రాష్ట్రాల బీజేపీ చీఫ్‌లుగా మరో ఇద్దరు మంత్రులు
  • దీంతో తెరపైకి పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు
  • 33శాతం మహిళలకు చోటు దక్కే అవకాశం?

న్యూఢిల్లీ, జూన్‌ 23 (చైతన్యగళం): కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశ రాజధానిలో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్‌లో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని కీలక సమాలోచనలు జరిపారు. మరోవైపు ఇద్దరు కేంద్రమంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగిసినా.. వారిని తిరిగి ఎంపిక చేయలేదు. వీరిలో ఒకరు బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలకు ఆస్కారమిచ్చాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమవుతాయని, అంతకుముందే మంత్రివర్గంలో కీలక మార్పులు జరుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగే కేంద్ర క్యాబినెట్‌ భేటీలో పార్లమెంట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, కేరళకు చెందిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్‌ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21న ముగిసింది. ఆయనను కేంద్రం తిరిగి నామినేట్‌ చేయలేదు. మరోవైపు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్‌ సింగ్‌ రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21నే ముగియగా.. ఆమెను కూడా రాజ్యసభకు తిరిగి ఎంపిక చేయలేదు. ఇక కేంద్ర రవాణా, రహదారులు, కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెలలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరికి చాలా కాలం క్రితమే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మంత్రివర్గంలో మరికొందరికి ఉద్వాసన తప్పదని, చాలా మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో 33 శాతం మహిళలకు తప్పక అవకాశం లభిస్తుందనే చర్చ మొదలైంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన మహిళా ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

పార్టీ పునర్వ్యవస్థీకరణ పైనా..

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే పార్టీ పునర్వ్యవస్థీకరణపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించింది. జీ7 సమావేశాలు పూర్తి కాగానే ఢిల్లీకి వచ్చిన ప్రధాని మోదీ.. రెండురోజుల క్రితం లూధియానాలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ను ఆగమేఘాలపై ఢిల్లీకి పిలిపించారు. రెండు రోజులుగా పార్టీలో ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యుల పై ఆయన సమాలోచనలు జరిపినట్లు తెలిసింది.

కీలక రాష్ట్రానికి గవర్నర్‌గా కురియన్‌?

కేంద్ర సహాయ మంత్రి జార్జి కురియన్‌ హఠాత్తుగా పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్‌లో ఏకైక క్రైస్తవ మంత్రి కురియన్‌ మాత్రమే. దీనిపై కురియన్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్లే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని, ఇది తాను కలలో కూడా ఊహించని అవకాశం అని పేర్కొన్నారు. కాగా, దేశంలో ఏదో ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్‌గా నియామకం కోసం కురియన్‌ పేరు పరిశీలనలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!