Wednesday, November 4, 2026
Homeతెలంగాణప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదు

📰 Generate e-Paper Clip

  • వసతి గృహాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలి
  • విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, నవంబర్ 2(చైతన్యగళం):

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాలు, విద్యాసంస్థల నిర్వహణపై ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి తనిఖీ నివేదికలను వెంటనే సమర్పించాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పట్టిక ప్రకారం రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నాగలక్ష్మి, డీఆర్డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన రాజు, డీపీఓ రేవంత్ తదితరులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులను వేగంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువగా సత్వర సేవలు అందించాలనే ఉద్దేశంతో డివిజన్, మండల స్థాయిల్లోనూ ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థలు, వసతి గృహాల్లో తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య, పోషకాహారం, పారిశుద్ధ్య నిర్వహణను ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీల అనంతరం నివేదికలు సమర్పించాలని సూచించారు. వసతి గృహాల్లో నాణ్యమైన సరుకులనే కొనుగోలు చేయాలని, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. భోజన సమయాల్లో ఆహార నాణ్యతను తెలియజేసేలా ఫొటోలను తెప్పించుకోవాలని సూచించారు.

విద్యాసంస్థల్లో రూ.లక్షలోపు వ్యయంతో చేపట్టాల్సిన చిన్నచిన్న మరమ్మతులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని, వాటికి తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా నైపుణ్యాభివృద్ధి కోర్సులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రజావాణికి 181 అర్జీలు

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు సమర్పించారు. మొత్తం 181 అర్జీలు అందగా, జిల్లా స్థాయిలో 115, డివిజన్ స్థాయిలో 7, మండల స్థాయిలో 59 దరఖాస్తులు నమోదయ్యాయి. మండల స్థాయి అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమన్వయం చేసుకుంటూ అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు.

కేసముద్రం మండలం సర్వపురం తండాకు చెందిన పి. భద్రు తన తండ్రి నుంచి సంక్రమించిన పట్టా భూమి ధరణి పోర్టల్‌లో అనుమతి లేని భూమిగా నమోదైందని తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించి డిజిటల్ సంతకంతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలని కోరారు.

నెల్లికుదురు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బి. రంగమ్మ తన పాత ఇల్లు కూలిపోవడంతో నివాసం లేక ఇబ్బందులు పడుతున్నానని, రికార్డుల్లో ఇల్లు ఆర్‌సీసీ భవనంగా నమోదైన అంశాన్ని సరిచేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మహబూబాబాద్ పట్టణంలోని 28వ వార్డులో సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమంతుని గడ్డ శ్రీ భక్త హనుమాన్ దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని, ఆలయ రక్షణ, నిర్వహణ, అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చుక్కల నరేష్ వినతిపత్రం సమర్పించారు.

ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు రాజేష్, దామోదర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!