- గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మంచిర్యాల, అక్టోబర్ 26 (చైతన్యగళం): చెన్నూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ రహదారుల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం చెన్నూరు పట్టణంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారితో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణానికి నూతన రూపు తీసుకువచ్చే లక్ష్యంతో రహదారుల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం, విద్యుద్దీపాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యాపారుల సహకారంతో రహదారుల విస్తరణ చేపట్టామని, బైపాస్ రహదారి పనులను రికార్డు సమయంలో పూర్తి చేశామని పేర్కొన్నారు. రహదారి విస్తరణలో నష్టపోయిన వ్యాపారులకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రస్తుతం 20 దుకాణాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. అర్హులైన వ్యాపారుల కోసం మరో 50 దుకాణాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో రూ.5.50 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడలి నుంచి పెద్ద చెరువు రావిచెట్టు వరకు రహదారి విస్తరణ, ఇరువైపులా మురుగు కాలువలు, మధ్య విభాజకం, విద్యుద్దీపాల ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. మహంకాళి ఆలయం నుంచి జాతీయ రహదారి 63 మీదుగా గోదావరి రోడ్డు వరకు రూ.3.50 కోట్లతో సీసీ రహదారి విస్తరణ, జాతీయ రహదారి 63 నుంచి గోదావరి పుష్కర ఘాట్ వరకు రూ.6 కోట్లతో రహదారి విస్తరణ, మధ్య విభాజకం, విద్యుద్దీపాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పుష్కర ఘాట్ సమీపంలో రూ.50 లక్షలతో ప్రత్యేక విద్యుద్దీపాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చెన్నూరు పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో ఇప్పటికే కొంతమేర సీసీ రహదారులు, మురుగు కాలువల పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయినందున పనులను వెంటనే ప్రారంభించి, గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత రహదారులతో పాటు శ్మశానవాటికలకు వెళ్లే మార్గాలను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.
కోటపల్లి ప్రాంతంలో ఎస్సీ వసతి గృహానికి అవసరమైన నిధుల కేటాయింపు, అభివృద్ధి చర్యలపై దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. జైపూర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మొసళ్ల పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మందమర్రి ప్రాంతంలోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల సౌకర్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, నిర్మాణాల్లో జాప్యం జరగకుండా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. సుద్దాల గ్రామంలో ఇసుక సరఫరాకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. నిర్మాణాలు ప్రారంభించని, నెమ్మదిగా సాగుతున్న ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని ప్రజాప్రతినిధులకు తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. బైపాస్ సమీపంలో రూ.6 కోట్లతో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నామని, మరో ప్రాంతంలో రూ.3.50 కోట్లతో రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రహదారులు, మురుగు కాలువలు, విద్యుద్దీపాల వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.
అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన నీటి ట్యాంకులు, పైప్‌లైన్ పనులను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు నీటి ట్యాంకులు, పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, మూడో ట్యాంకు పనులను త్వరగా పూర్తి చేసి తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. అన్ని వార్డుల్లో సౌర విద్యుత్తుతో పనిచేసే ఎత్తైన దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఇతర ప్రజా సౌకర్యాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అనంతరం మంత్రి గడ్డం వివేకానంద జైపూర్ మండలం వేలాల గ్రామంలోని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. గోదావరి తీరంలో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.4.25 కోట్లతో నిర్మించనున్న పుష్కర ఘాట్ పనులకు జిల్లా కలెక్టర్, ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వనజారెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.70 కోట్లు, చెన్నూరులో శివాలయ అభివృద్ధికి రూ.17 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మొసళ్ల పార్కు అభివృద్ధితో పాటు గాంధారి మైసమ్మ ఆలయం తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జైపూర్ విద్యుత్ కేంద్రం విస్తరణతో సుమారు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన ఆర్కే ఓపెన్‌కాస్ట్ గని ప్రారంభంతోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
మందమర్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రం ద్వారా యువతకు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం సుమారు 70 మంది శిక్షణ పొందుతున్నారని, అర్హత సాధించిన వారికి జర్మనీలో ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని, మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వచ్చే ఐదేళ్లలో చెన్నూరు నియోజకవర్గంలో 12 వేల నుంచి 15 వేల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే సుమారు ఐదు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వాతావరణ పరిస్థితులను ప్రజలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
