- అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, అక్టోబర్ 25 (చైతన్యగళం): మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ప్రజలు ఓటుతో తీర్పు ఇచ్చినా ఆయన తీరు మారలేదని, వనపర్తి ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనలో వనపర్తి అభివృద్ధి పేరుతో విధ్వంసానికి గురైందని మేఘారెడ్డి ఆరోపించారు. బీసీ నాయకులపై కేసులు, విలేకరులపై అట్రాసిటీ కేసులు, వివిధ వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఉద్యోగాల పేరుతో పోస్టులకు ధరలు నిర్ణయించి, కమీషన్లు వసూలు చేశారనే ఆరోపణలు కూడా గత పాలనపై ఉన్నాయని పేర్కొన్నారు.
“మీరు వెయ్యి మందితో వస్తే.. నేను 50 వేల మందితో వస్తా” అంటూ నిరంజన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మేఘారెడ్డి స్పందిస్తూ, వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాల్లో బెదిరింపులు, వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు.
బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మేఘారెడ్డి ప్రకటించారు. గత పాలనకు సంబంధించిన పత్రాలతో నిరంజన్‌రెడ్డి చర్చకు రావాలని, తాను పత్రాలు లేకుండానే చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
వనపర్తి ప్రజలకు అహంకారపూరిత నాయకత్వం కావాలా, ప్రజలకు సేవ చేసే నాయకత్వం కావాలా అన్నది వారే నిర్ణయిస్తారని అన్నారు. ఎంతమందితో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రాజకీయాల్లో బెదిరింపుల కంటే అభివృద్ధి, ప్రజాసేవకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
