Saturday, October 24, 2026
Homeసంపాదకీయంనీటిని పొదుపు చేయాలి.. ఇంకుడు గుంతలు నిర్మించాలి!

నీటిని పొదుపు చేయాలి.. ఇంకుడు గుంతలు నిర్మించాలి!

📰 Generate e-Paper Clip

  • ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
  • రూ.50 లక్షలతో 31వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం – కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 24 (చైతన్యగళం): వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కరీంనగర్‌ నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని 31వ డివిజన్‌లో శనివారం మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పర్యటించారు. స్థానిక కార్పొరేటర్‌ సయ్యద్‌ ముఖద్దర్‌ హుస్సేన్‌ అలీతో కలిసి ఖాన్‌పూర్‌ రోడ్‌ నంబర్‌ 11, ప్రవిష్టా రోడ్డులో యూఐడీఎఫ్‌ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రెండు ప్రాంతాల్లో రూ.19.40 లక్షలు, రూ.30.60 లక్షల వ్యయంతో ఆర్‌సీసీ, ఎస్‌డబ్ల్యూజీ పైపులైన్లతో డ్రైనేజీ నిర్మాణం, సీసీ ప్యాచ్‌వర్కులు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సూచనలు, సహకారంతో నగరాన్ని పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తోందని మేయర్‌ తెలిపారు. నూతన పాలకవర్గం ఏర్పడిన తొలినాళ్లలోనే 31వ డివిజన్‌లో నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.12 లక్షలు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం యూఐడీఎఫ్‌ నిధులతో మరో రూ.50 లక్షల పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నగరంలోని 66 డివిజన్లలో రూ.50 కోట్ల యూఐడీఎఫ్‌ నిధులతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పలు చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సహకారంతో కరీంనగర్‌ను అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ పథకంలో చేర్చి నగర అభివృద్ధి కోసం రూ.840 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు మేయర్‌ తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అనుమతుల కోసం పంపించినట్లు చెప్పారు. అనుమతులు రాగానే ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని వివరించారు.

నగరంలో వీధికుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్‌ పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో 40 కెనాల్స్‌ మాత్రమే ఉండటంతో అధిక సంఖ్యలో కుక్కలకు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడం ఇబ్బందిగా మారిందన్నారు. గతంలో స్మార్ట్‌ సిటీ నిధుల నుంచి సుమారు రూ.2 కోట్లు కేటాయించి, అదనపు సౌకర్యాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభించి, మరిన్ని కెనాల్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చి వీధికుక్కల సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపై విచ్చలవిడిగా వదలకుండా సంరక్షించుకోవాలని మేయర్‌ సూచించారు. పశువులు రోడ్లపై సంచరించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వ్యర్థాలను తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పశువుల యజమానులు బాధ్యతగా వ్యవహరించి వాటిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ పునరుద్ఘాటించారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని అవసరమైన మేరకే వినియోగించాలని, కుళాయిలకు ఆన్‌-ఆఫ్‌ సదుపాయాలు ఏర్పాటు చేసుకొని నీటి వృథాను అరికట్టాలని సూచించారు. నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలం ఉన్నవారు ఇంకుడు గుంతలు నిర్మించుకొని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చూడాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడుకోవడంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ అధికారులు, డివిజన్‌ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!