- 11 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఫోరం సంపూర్ణ మద్దతు
మహబూబాబాద్ (చైతన్యగళం):
రాష్ట్రంలోని అర్హులైన జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ శాసనసభలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్హెచ్ఎం ఉద్యోగులు గత 11 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెకు ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్, వైస్ చైర్మన్ డాక్టర్ నాగరాజు కందుల సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సమ్మెలో ఆర్బీఎస్కే బృందం కూడా పాల్గొంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘీభావం తెలిపింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు.
2016లో జారీ చేసిన జీవో నంబర్ 16 ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన నిబంధనలు ప్రవేశపెట్టినట్లు డాక్టర్ నాగరాజు కందుల తెలిపారు. అయితే, 2024 నవంబర్ 19న తెలంగాణ హైకోర్టు సెక్షన్ 10-ఏను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేసిందని వివరించారు. గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాంగ నిబంధనలు, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో భాగంగా క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం, పదవీ విరమణ ప్రయోజనాలు, సీనియారిటీ ఆధారంగా వేతన పురోగతి, బ్యాంకు రుణ సదుపాయాలు, బదిలీ సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి నెలా నిర్ణీత తేదీన జీతాలు చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ శివరామ్, డాక్టర్ సంజీవ్ నాయక్, ఎన్హెచ్ఎం జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమాకర్, కంబాల నవీన్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
