- రక్తహీనత నివారణకు పౌష్టికాహారం తీసుకోవాలి: న్యాయమూర్తి స్వాతి మురారి
మహబూబాబాద్(చైతన్యగళం): బాలికలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి స్వాతి మురారి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని ప్రభుత్వ బాలల సదనం (బాలికలు)లో నిర్వహించిన ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సదనంలోని బాలికలకు నిర్వహించిన వైద్య పరీక్షలను స్వయంగా పరిశీలించారు. చివరి చిన్నారికి వైద్య పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉండి శిబిరం నిర్వహణను పర్యవేక్షించారు. అనంతరం బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణలో హిమోగ్లోబిన్ శాతం ఎంతో కీలకమని వివరించారు. ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత సమస్యను నివారించేందుకు ఐరన్ సమృద్ధిగా ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. సదనంలోని చిన్నారులకు అందించే ఆహారంలో తగిన పోషక విలువలు ఉండేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

అనంతరం వైద్యురాలు డాక్టర్ అనిత హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న బాలికలతో ప్రత్యేకంగా మాట్లాడి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. కౌమారదశలో ఉన్న బాలికలకు రుతుక్రమ సమయంలో పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత, తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. వసుమతి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ జయమని, ఆరోగ్య విద్యాధికారి శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ ఆర్. లావణ్య, హెల్త్ సూపర్వైజర్ పుష్పలత, హెల్త్ అసిస్టెంట్ రాజేందర్, సదనం సూపరింటెండెంట్ ధనలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
