Thursday, November 26, 2026
Homeతెలంగాణబాలికలు చదువుతో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలి

బాలికలు చదువుతో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలి

📰 Generate e-Paper Clip

  • క్షణిక ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దు.. సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి

మహబూబాబాద్(చైతన్యగళం): క్షణిక ఆకర్షణలు, ఆనందాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి స్వాతి మురారి విద్యార్థినులకు సూచించారు. కష్టపడి చదివి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి సొంత కాళ్లపై నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు.

అక్టోబర్ 11న నిర్వహించనున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్‌లో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక రత్న టెక్నో స్కూల్‌లో నిర్వహించిన సదస్సులో స్వాతి మురారి పాల్గొని బాలల హక్కులు, చట్టాలు, రక్షణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఆపదలో ఉన్న పిల్లలు లేదా వారి గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 15100 ఉచిత న్యాయ సహాయ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం కళాశాల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి డీఎల్ఎస్ఏ ద్వారా అందుతున్న న్యాయ సేవలను వివరించారు. న్యాయ సేవా అధికార సంస్థల చట్టంలోని సెక్షన్ 12(సి) ప్రకారం మహిళలకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని తెలిపారు.

పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ.. క్షణిక ఆకర్షణలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సంబంధిత వ్యక్తుల జీవితాలతో పాటు రెండు కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. బాలికలు ఇలాంటి వాటికి దూరంగా ఉండి చదువు, సాధికారతపై దృష్టి సారించాలని సూచించారు.

“కష్టపడి చదివి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడటం ఎంతో గొప్ప అనుభూతి. ప్రతి బాలికా ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలి” అని స్వాతి మురారి ఆకాంక్షించారు.

మహిళలు, విద్యార్థినులకు ఎలాంటి న్యాయ సహాయం లేదా సలహా అవసరమైనా NALSA టోల్‌ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేసి ఉచిత సేవలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బీసీ బాలికల వసతి గృహం సంక్షేమ అధికారి ఎల్. సుష్మ, రత్న టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ సాబీర్, విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!