Sunday, October 25, 2026
Homeఆంధ్రప్రదేశ్ఐఐటీయన్ల మేధస్సుతో ఏపీని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

ఐఐటీయన్ల మేధస్సుతో ఏపీని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

  • అమరావతిని ప్రపంచ స్థాయి లోతైన సాంకేతికత కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

విజయవాడ, అక్టోబర్‌ 3(చైతన్యగళం): ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఐఐటీయన్ల మేధస్సును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధికి ఐఐటీయన్లు అనుసంధానమై పనిచేయాలని సూచించారు. అమరావతిని ప్రపంచస్థాయి జ్ఞాన, డీప్‌టెక్‌ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కళావేదికలో శనివారం జరిగిన పాన్‌ ఐఐటీ ఏపీ సదస్సు–2026లో సీఎం పాల్గొన్నారు. అమరావతి కేంద్రంగా పాన్‌ ఐఐటీ వరల్డ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. డీప్‌టెక్‌ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల పాన్‌ ఐఐటీ అమరావతి వెంచర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

సదస్సులో క్యూబిట్‌ ఫోర్స్‌ రూపొందించిన ‘క్యూ–శివ’ పేరుతో ఐదు క్వాంటం కంప్యూటర్లను సీఎం ఆవిష్కరించారు. ఇవి చిన్నస్థాయి పరీక్షా క్వాంటం కంప్యూటర్‌ ప్రయోగశాలలుగా ఉపయోగపడనున్నాయి. 4 కెల్విన్‌ ప్రాసెసర్‌ను కూడా ఆవిష్కరించారు. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీకి శ్రీకారం చుట్టడం రాష్ట్రంలో డీప్‌టెక్‌ ఉత్పత్తుల తయారీ సామర్థ్యానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.

అమరావతిలో క్వాంటం పర్యావరణ వ్యవస్థ

దేశంలోని 23 ఐఐటీలు ప్రపంచానికి అత్యుత్తమ మేధస్సును అందించాయని, జాతి నిర్మాణంలో ఐఐటీయన్ల పాత్ర కీలకమని చంద్రబాబు అన్నారు. సిలికాన్‌ వ్యాలీ తరహాలో భవిష్యత్తులో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు.

అమరావతిలో ఇప్పటికే క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరీక్షా వేదికలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఐబీఎం–టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటర్‌ అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుందని, 2027 ఫిబ్రవరి నుంచి క్వాంటం కంప్యూటర్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

156 క్యూబిట్‌ క్వాంటం వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలోగానే అమరావతిలో క్వాంటం సాంకేతికతకు అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్లతో పాటు వాటికి అవసరమైన పరికరాలను కూడా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఐఐటీ స్థాయి ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని, ఆరో తరగతి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తల నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఇందుకు ఐఐటీలు సహకరించేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.

రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి

వినూత్న ఆలోచనలను ఆచరణలో పెడితే అభివృద్ధిలో మార్పు సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 20 రకాల ఫలాల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న రాయలసీమను సమర్థవంతమైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతికతతో వచ్చే పదేళ్లలో ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ తరహాలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రిలయన్స్‌ సంస్థ సహకరించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.

దేశంలో కోటి మంది కృత్రిమ మేధ నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఏపీ నుంచి 50 లక్షల మంది కృత్రిమ మేధ నిపుణులను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సీఎం వెల్లడించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకోవచ్చన్నారు.

పాన్‌ ఐఐటీ ఏపీ సదస్సు ప్రకటన

రెండు రోజుల సదస్సులో జరిగిన మేధోమథనం అనంతరం పాన్‌ ఐఐటీ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో పాన్‌ ఐఐటీ వరల్డ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలను అనుసంధానం చేసే వేదికగా ఇది పనిచేయనుంది.

దేశంలోని 23 ఐఐటీలకు చెందిన సుమారు ఐదు లక్షల మంది ఐఐటీయన్ల మేధస్సును ఏపీ అభివృద్ధికి వినియోగించుకునేలా నెట్‌వర్క్‌ను రూపొందించనున్నారు. డీప్‌టెక్‌ అభివృద్ధికి పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌ సమన్వయ సంస్థగా పనిచేయనుంది.

23 ఐఐటీలు, 25 ఆవిష్కరణ కేంద్రాల నుంచి సాంకేతికతలను గుర్తించి రాష్ట్రంలోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఉత్పత్తుల అభివృద్ధికి అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను పాన్‌ ఐఐటీ వ్యవస్థతో అనుసంధానం చేసి పరిశోధన, అధ్యాపకులు, విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించనున్నారు.

పరిశోధన, నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు 10 పరిశ్రమల విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది ఐఐటీ మెంటర్లతో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి ఏపీ స్టార్టప్‌లు, ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేయనున్నారు. 2030 నాటికి రాష్ట్రంలో కనీసం 50 స్టార్టప్‌లను ఇంక్యుబేట్‌ చేసేలా ప్రణాళిక రూపొందించారు.

క్వాంటమ్‌–కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అంతరిక్ష–రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయ సాంకేతికత, సముద్ర ఆర్థిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా డీప్‌టెక్‌ విధానంలో చర్యలు చేపట్టనున్నారు. రూ.500 కోట్ల వెంచర్‌ ఫండ్‌ను డీప్‌టెక్‌ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతల్లో పెట్టుబడులకు వినియోగించనున్నారు.

వివిధ రంగాలపై చర్చలు

పాన్‌ ఐఐటీ సదస్సులో ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ తిరుపతి, ఐఐటీ జమ్మూ, ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ ధన్‌బాద్‌, ఐఐటీ వారణాసి, ఐఐటీ భువనేశ్వర్‌ తదితర సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఐఐటీల ప్రతినిధులు, పెట్టుబడి సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమై ఉత్తమతా కేంద్రాల ఏర్పాటు, సాంకేతిక బదిలీ, పట్టణీకరణలో డీప్‌టెక్‌ వినియోగం, స్టార్టప్‌లు, పెట్టుబడులపై చర్చించారు.

ప్రతి ఏడాది పాన్‌ ఐఐటీ సదస్సు నిర్వహించి వివిధ అంశాలపై చర్చించాలని సీఎం ప్రతిపాదించారు. ఇంధనం, స్వచ్ఛాంధ్ర, నిత్యజీవితంలో డీప్‌టెక్‌, అంతరిక్షం, అంతరిక్ష–రక్షణ తయారీ, అందరికీ ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ సాంకేతికత–రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. అనంతరం సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సీఎం పరిశీలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!