- సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని అఖిలపక్షాల డిమాండ్
సిద్దిపేట, అక్టోబరు 1 (చైతన్యగళం): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించే చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో పలువురు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఎస్.వి. శ్రీకాంత్, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
