Tuesday, September 29, 2026
Homeతెలంగాణఅసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా

అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా

📰 Generate e-Paper Clip

  • 2014 తర్వాత తెలంగాణలో పోటీ కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌గా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (చైతన్యగళం): తాను తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దానికంటే ఎక్కువసార్లు జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్‌ 2026’లో ‘ఇండియాస్‌ నెక్ట్స్‌ చాప్టర్‌’ అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలు, విద్య, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, డీలిమిటేషన్‌, తన రాజకీయ ప్రస్థానంపై వివరించారు.

విద్యకే తొలి ప్రాధాన్యం: నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్య వల్లే అంబేడ్కర్‌ రాజ్యాంగ రచనా స్థాయికి, మన్మోహన్‌సింగ్‌ ప్రధాని స్థాయికి, అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతోపాటు ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌లో చేరడానికి కారణం: 2006లో స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీగా, 2007లో స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచానని రేవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం టీడీపీలో చేరి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచానని, 2017లో కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా ఎన్నికయ్యానని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడిన నేపథ్యంలో ప్రజల సూచనతో కాంగ్రెస్‌లో చేరానన్నారు. రాహుల్‌గాంధీని తొలిసారి కలిసినప్పుడే ఆయనను నాయకుడిగా నిర్ణయించుకున్నానని, దేశమే ఆయనకు ముఖ్యమని పేర్కొన్నారు.

‘కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌’గా మారింది: 2014 తర్వాత తెలంగాణలో రాజకీయ పోటీ కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌గా మారిందని సీఎం అన్నారు. అప్పట్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రం, ఏపీలో ఎన్డీఏతో పోరాడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌, జైరాం రమేశ్‌ తన శ్రేయోభిలాషులని తెలిపారు. తాను విద్యార్థి సంఘం, టీడీపీ, కాంగ్రెస్‌లో ఎక్కడ ఉన్నా దేశం, రాష్ట్రం కోసం పనిచేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!