- పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ సంయుక్త ఆపరేషన్.. తుపాకీ, 13 కిలోల మాంసం స్వాధీనం
షాద్‌నగర్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): కృష్ణజింకను వేటాడి దాని మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలపై తొమ్మిది మందిని పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి .315 రైఫిల్, టెలిస్కోప్, సైలెన్సర్, 19 బుల్లెట్లు, సుమారు 13 కిలోల కృష్ణజింక మాంసం, రెండు వాహనాలు, ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ.28,590 నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు షాద్‌నగర్ డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపారు.
సోమవారం షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సెప్టెంబరు 26న హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది మంది కార్లలో నారాయణపేట జిల్లా మరికల్ అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. మరుసటి రోజు లైసెన్స్‌డ్ తుపాకీతో కృష్ణజింకను వేటాడి, మాంసాన్ని ప్యాక్ చేసుకుని హైదరాబాద్‌కు బయలుదేరినట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో రాయకల్ టోల్‌ప్లాజా సమీపంలో తనిఖీలు నిర్వహించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న వారిలో ఎం.డి. హాజీ ఉద్దీన్, మీర్ ముక్తార్ అలీ, ఎం.డి. తాజుముల్, మీర్ రాజా అలీ ఖాన్, ఖుర్రం ఖాన్, సయ్యద్ సల్మాన్ అలీ, ఎం.డి. అఫ్రోజ్ ఖాన్, ఎం.డి. అబ్దుల్ అజీజ్, ఎం.డి. రియాజ్ ఉన్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సంబంధిత సెక్షన్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వన్యప్రాణులను వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని డీసీపీ హెచ్చరించారు. అక్రమ వేటకు సంబంధించిన సమాచారం ఉంటే అటవీశాఖ టోల్‌ఫ్రీ నంబర్లు 1800-425-5364, 040-23231440కు తెలియజేయాలని కోరారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
