Sunday, October 4, 2026
Homeతెలంగాణకరీంనగర్కథలు సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనాలు

కథలు సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనాలు

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 27 (చైతన్యగలం):

కథలు మనిషి ఆలోచనా సరళిని, సమాజ పోకడలను మార్చే శక్తివంతమైన సాధనాలని, వ్యక్తిగతంగా మనిషిని తీర్చిదిద్దడంలోనూ, సామాజికంగా మార్పు తీసుకురావడంలోనూ కథలు కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా తన తండ్రి పేరిట ఇచ్చే రజనీశ్రీ సాహిత్య పురస్కార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ‘విత్తనం’ కథా సంపుటి రచించిన పెద్దింటి అశోక్ కుమార్‌కు పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు కథలు విభిన్న జీవన విధానాలను, సంస్కృతులను ప్రతిబింబిస్తాయని, ఇది వ్యక్తి మానసిక వికాసానికి తోడ్పడుతుందన్నారు. పాఠకులు కథలోని పాత్రల స్థానంలో తమను ఉంచుకుని చూడటం వల్ల ఇతరుల భావోద్వేగాలను, కష్టాలను అర్థం చేసుకునే గుణం వారిలో పెరుగుతుందని స్పష్టం చేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ భారతీయులందరినీ కలిపి ఉంచే అంతఃసూత్రం భారతీయత అని చాటిచెప్పే భావాత్మక కథలు, కులమతాల కంటే దేశ సమైక్యత, మానవత్వమే గొప్పవని వివరిస్తూ జాతీయ సమగ్రతకు ప్రాధాన్యమిచ్చిన కథలు తెలుగు సాహిత్యంలో గతంలో చాలా వెలువడ్డాయని, ప్రస్తుతం అటువంటి కథలను తెలంగాణ కథకులు విరివిగా రాయాలని పిలుపునిచ్చారు పురస్కార గ్రహీత పెద్దింటి అశోక్ కుమార్ తెలంగాణ సమాజాన్ని, జీవన విధానాన్ని తన కథల్లో అత్యంత సహజంగా పొందుపరిచారని ప్రశంసించారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతీ సంప్రదాయాలను, చారిత్రక సత్యాలను సులువుగా అందించడానికి కథలు దోహదపడతాయని, సమాజంలో ఒకరి అనుభవాలు మరొకరికి తెలియడం వల్ల మానవ సంబంధాలు మరింత బలపడతాయన్నారు. తెలంగాణ స్వచ్ఛమైన మాండలికంలో కథలు రాయడం ద్వారా మన యాసకూ, సంస్కృతికీ ఉన్న సహజమైన అందాన్ని, ఆత్మీయతను పెద్దింటి అశోక్ కుమార్ తన కథల్లో నిలిపారని కొనియాడారు సంస్థ జిల్లా శాఖ అధ్యక్షులు గాజుల రవీందర్ అధ్యక్షత వహించిన ఈ సభలో నలిమెల భాస్కర్, డాగండ్ర లక్ష్మణరావు, డా. పొన్నం రవిచంద్ర, అన్నవరం దేవేందర్, బెజ్జారం వినోద్ కుమార్, బాపురం నరహరిరావు మాట్లాడారు. కటుకోజ్వల మనోహరాచారి పుస్తక పరిచయం చేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ సభా సమన్వయం చేయగా, స్తంభంకాడి గంగాధర్ నివేదిక సమర్పించారు. డా. ముత్తినేని శ్రీనివాస్, గంగుల శ్రీకర్, జక్కని గణేశ్, గాజుల హేమలతాదేవి, సంపత్ రాజ్, జెట్టి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!