Sunday, September 27, 2026
Homeతెలంగాణఖైదీల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవాధికార సంస్థ అండ

ఖైదీల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవాధికార సంస్థ అండ

📰 Generate e-Paper Clip

  • సబ్‌జైలులో విచారణ ఖైదీలతో ముఖాముఖి.. ప్రధాన జిల్లా న్యాయమూర్తి కె. మురళీమోహన్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): సమాజంలోని బలహీనవర్గాలకు న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్‌ అన్నారు. శనివారం స్థానిక సబ్‌జైలును సందర్శించిన ఆయన విచారణ ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి వారి హక్కులు, ఉచిత న్యాయ సహాయం, జైలు జీవితం అనంతరం బాధ్యతాయుత పౌరులుగా జీవించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు.

రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. నిరుపేదలు, న్యాయ సహాయం అవసరమైన వారికి సత్వర, ఉచిత న్యాయ సహాయం అందించేందుకే న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఉచిత న్యాయ సహాయం నాణ్యతపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, అర్హులైన వారు పూర్తి నమ్మకంతో సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

జైలులో ఉన్నంత మాత్రాన ఖైదీలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోరని న్యాయమూర్తి పేర్కొన్నారు. విచారణ ఖైదీలకు పరిశుభ్రమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. జైలు జీవితాన్ని తమలో మార్పు తీసుకొచ్చే అవకాశంగా మలచుకుని, సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాగించాలని సూచించారు.

అనంతరం సబ్‌జైలు బ్యారక్‌లు, వంటగది, సరుకుల నిల్వ గదిని పరిశీలించి ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రతను తనిఖీ చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ దాసరి నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ వి. రాజు కృష్ణ, జైలర్‌ శ్రీనివాస్‌, పారా లీగల్‌ వాలంటీర్‌ రాంప్రభు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!