మర్రిగూడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మర్రిగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. వరి నాట్లు వేసిన రైతులు విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా రైతుల మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు కాలిపోయి నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపారు. పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో దిగుబడులపై ప్రభావం పడుతోందన్నారు. కాలిపోయిన మోటార్లకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
నీటి కొరత, విద్యుత్ సరఫరా అంతరాయాలతో పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి సమగ్రంగా పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. రైతులు సాగు కోసం చేసిన అప్పులు, పంట రుణాలను త్వరగా మాఫీ చేసి రుణభారం నుంచి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, సల్వోజు రామలింగాచారి, ఏర్కొండ రాఘవేంద్ర, మాల్‌రెడ్డి నరసింహారెడ్డి, ఏర్కొండ యాదయ్య, ఊరుపక్క వెంకటయ్య, కృపాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
