Sunday, September 13, 2026
Homeక్రైమ్ న్యూస్హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

  • రూ.1,000 జరిమానా.. 2026లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22వ నేర నిర్ధారణ

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): కరీంనగర్‌-1 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు పైడిపాల వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌కు గౌరవ ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రూ.1,000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది.

కేసు వివరాల ప్రకారం.. 2023 జూన్‌ 29న కరీంనగర్‌లోని క్రిస్టల్‌ ప్లాజా అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 203లో గుండా సరిత హత్యకు గురయ్యారు. మృతురాలితో నిందితుడికి సన్నిహిత సంబంధం ఉండగా, వాట్సాప్‌ సంభాషణలు, డబ్బు వ్యవహారాలపై తలెత్తిన వివాదం హత్యకు దారితీసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు ఆమెపై దాడి చేసి హత్య చేసిన అనంతరం మొబైల్‌ ఫోన్‌, బ్యాంకు కార్డులు, పత్రాలు, చెక్‌బుక్‌లను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.90 వేలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడని, ఆమె ఫోన్‌ నుంచే వాట్సాప్‌ సందేశాలు పంపి సజీవంగా ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు.

పోలీసులు 2023 జూలై 3న నిందితుడిని అరెస్టు చేసి, రక్తపు మరకలున్న దుస్తులతో పాటు ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌, వేలిముద్రల ఆధారాలతోపాటు సమర్థవంతమైన దర్యాప్తు ద్వారా నేరం రుజువైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధించింది.

2026లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇది 22వ నేర నిర్ధారణ కావడం విశేషం. ఏసీపీ సీసీఆర్బీ శ్రీనివాస్‌ జి. పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి ఎం. రవికుమార్‌, అప్పటి కరీంనగర్‌-1 టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌హెచ్‌ఓ కె. రామ్‌చందర్‌రావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం. ప్రతాప్‌, కోర్టు విధుల అధికారులు ఎస్‌.డి. సర్వర్‌ అలీ, ఎం. సతయ్య తదితరులు కేసు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. వారి సేవలను పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!