- నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సెప్టెంబర్ 23న జరిగే ప్రధాన నిమజ్జన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్‌తో కలిసి పీస్ కమిటీ సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు.
ప్రతి గణేష్ మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో బ్యారికేడ్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లు, వైద్య శిబిరాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిమజ్జన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి మండపాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్, విద్యుత్, మున్సిపల్, వైద్య తదితర శాఖలతో ప్రత్యేక నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి, పీస్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
