Monday, August 24, 2026
Homeతెలంగాణడ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

  • గూడూరులో వెయ్యి మందికి పైగా విద్యార్థులతో 2కే రన్‌
  • జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ డా. శబరీష్‌ పి., ఐపీఎస్‌ — డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు పిలుపు

గూడూరు, ఆగస్టు 22(చైతన్యగళం): డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మహబూబాబాద్‌ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో ‘మన ఊరు–మన బాధ్యత’ 2కే రన్‌–ఫర్‌ డ్రగ్స్‌ ఫ్రీ సొసైటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పాఠశాలలు, కళాశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్‌ పి., ఐపీఎస్‌ జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో విలువైనదని, యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ జీవిత లక్ష్యాల సాధనకు కష్టపడాలని సూచించారు. డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు భవిష్యత్‌ను నాశనం చేస్తాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసైతే జీవితాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

డ్రగ్స్‌ వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పోలీస్‌ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. ఇందులో భాగంగా గంజాయి టెస్టింగ్‌ కిట్‌ పనితీరును విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. మాదకద్రవ్యాల వినియోగంపై అనుమానం ఉన్న సందర్భాల్లో పరీక్షల ద్వారా గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు.

డ్రగ్స్‌ను విక్రయించడం, సరఫరా చేయడం, రవాణా చేయడం, వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం వల్ల ఉద్యోగ, విదేశీ ప్రయాణ అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

మైనర్లకు సిగరెట్లు, గుట్కా, పాన్‌మసాలా తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణదారులపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిరాణా, పాన్‌ షాపుల వద్ద మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదనే హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

జిల్లాను గంజాయి, డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు, యువత పోలీస్‌ శాఖకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారికి రూ.5 వేల వరకు నగదు బహుమతి అందజేస్తామని, సమాచారదాత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డ్రగ్స్‌, గంజాయికి సంబంధించిన సమాచారం కోసం యాంటీ డ్రగ్‌ హెల్ప్‌లైన్‌ 87126 56999ను సంప్రదించాలని సూచించారు.

అనంతరం ఎస్పీ డా. శబరీష్‌ పి. ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, పోలీస్‌, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!