- ప్రపంచ రికార్డు ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఎం.డి. జాంగీర్.. అభినందించిన మాస్టర్లు
వెల్దండ, ఆగస్టు 10 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఎం.డి. జాంగీర్ తైక్వాండో క్రీడారంగంలో తన ప్రతిభను చాటుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. హైదరాబాద్లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ సాధించిన జాంగీర్, హైదరాబాద్లో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు.
తైక్వాండో క్రీడారంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా జాంగీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం వెల్దండ ప్రాంతానికి గర్వకారణమని గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తైక్వాండో కార్యక్రమంలో ప్రపంచ రికార్డు సాధించినట్లు తెలిపారు. క్రీడాకారుడిగా జాంగీర్ చూపిన ప్రతిభ, పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఎం.డి. జాంగీర్ను మాస్టర్ ఎం.డి. ఖలీల్, మాస్టర్ కుమార్ అభినందించారు. జాంగీర్ సాధించిన ఈ ఘనతతో వెల్దండ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.
