మంథని, ఆగస్టు 1 (చైతన్యగళం):
జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది మాట్లాడుతూ, “ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన శిక్షలు అమలులో ఉన్నాయి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలు, అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. తోటి విద్యార్థులపై కళాశాల ప్రాంగణంలో గానీ, బయట గానీ ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన శిక్షలు తప్పవు” అని హెచ్చరించారు.
ర్యాగింగ్ అనైతిక చర్య, అమానవీయమని ఆమె పేర్కొంటూ, “భారతీయ సంస్కృతిలో ఇలాంటి చర్యలకు స్థానం లేదు. విద్యార్థులు సత్ప్రవర్తనతో, చట్టబద్ధంగా మెలగాలి” అని సూచించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. రఘోతం రెడ్డి మాట్లాడుతూ, “ర్యాగింగ్ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం. మనం చట్టబద్ధమైన పౌరులుగా ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా జాగ్రత్తగా ఉండాలి. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్. సుదారాణి, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అనురాధ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కటకం శ్రీనివాస్, న్యాయవాదులు శశిభూషణ్ కాచె, నూనేటి ఆంజనేయులు, సీఐ బుద్దేశ్వామి, ఎస్సై టి. శ్రీనివాస్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ ప్రనీత్, జేఎన్టీయూ ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
