Monday, August 3, 2026
Homeఎడిటోరియల్మృగత్వాన్ని పెంచుతున్న 'అతి' ప్రేమ.. మనిషిని మానసిక రోగిగా మారుస్తున్న నేటి సమాజం

మృగత్వాన్ని పెంచుతున్న ‘అతి’ ప్రేమ.. మనిషిని మానసిక రోగిగా మారుస్తున్న నేటి సమాజం

📰 Generate e-Paper Clip

నాడు చందమామను చూపిస్తూ ముద్దలు తినిపించిన తల్లి చేతులు నేడు పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తున్నాయి. నాడు తప్పు చేస్తే మందలించే తండ్రి నేడు పిల్లల అనాగరిక పనులను కూడా వెనకేసుకొస్తున్నాడు. ఫలితం? సమాజంలో విచక్షణ కోల్పోతున్న మనుషులు పెరుగుతున్న నేరాలు పతనమవుతున్న నైతిక విలువలు. మనిషి తనలోని ఇంగితాన్ని మరిచి మానసిక కల్లోలానికి లోనవుతూ మానసిక రోగి గా మారుతున్నాడనడానికి నిత్యం పేపర్లలో చూసే ఘోరాలే సాక్ష్యం.
దీనికి అసలు కారణం ఎక్కడ ఉంది? వ్యవస్థదా? విద్యాసంస్థలదా? అంటే. ముమ్మాటికీ పునాది పడాల్సిన ఇల్లు మరియు తల్లిదండ్రుల దగ్గరే లోపం ఉందనేది చేదు నిజం.

భయం లేని చోట బాధ్యత శూన్యం! గత తరంలో పిల్లలకు తప్పు చేయాలంటే ఒక రకమైన భయం గౌరవం ఉండేవి. తల్లిదండ్రులకైనా గురువులకైనా సమాజానికైనా జడిసేవారు. కానీ నేడు
ఎవరికీ భయపడట్లేదు నేటి పిల్లలు తల్లిదండ్రులకు భయపడడం లేదు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను లెక్కచేయడం లేదు చట్టాన్ని అసలే గౌరవించడం లేదు.
కారణం ఏమిటి? గత తరంలో లేని అతి ప్రేమ అతి గారాబం నేటి తల్లిదండ్రుల్లో పెరిగిపోవడం. పిల్లాడు తప్పు చేసినా సమర్థించడం, అడిగిందల్లా క్షణాల్లో చేతిలో పెట్టడం వల్ల వారికి దేని విలువ తెలియడం లేదు. శిక్ష లేని చోట క్రమశిక్షణ కరువవుతోంది.

అతి సర్వత్ర వర్జయేత్ అతి ప్రేమ అతి అపేక్ష అతి కోపం ఇలా ఏదైనా అతి అనేది ఒక మానసిక రోగమే. ఇది మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అమ్మల పెంపకంలో వివక్షే అసలు ముప్పు సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రతి తల్లి తన కూతురికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఇది చాలా అవసరం మంచి పరిణామం. కానీ అదే తల్లి తన కొడుకుకి ఏం నేర్పిస్తోంది?
అబ్బాయిలకు ప్రవర్తన నేర్పరా? అమ్మాయిలకు రక్షణ నేర్పే సమాజం అబ్బాయిలకు మంచి ప్రవర్తన చెడు ప్రవర్తన ఎందుకు నేర్పడం లేదు?

ఇంగితం ఎక్కడ? పరస్త్రీని గౌరవించడం తోటి మనిషిని ప్రేమించడం అనే ప్రాథమిక సూత్రాలను కొడుకులకు చిన్నప్పటి నుంచే ఇంట్లో నేర్పకపోవడం వల్లే వారు పెద్దయ్యాక సమాజానికి కంటకంగా మారుతున్నారు.

చందమామ పోయె స్మార్ట్‌ఫోన్ వచ్చె

ఒకప్పుడు అద్దంలోనో పెరట్లో నిలబడి ఆకాశంలోనో చందమామను చూపిస్తూ పిల్లలకు కథలు చెప్పి సంస్కారాన్ని నూరిపోసేవారు. మరి నేడు? తల్లి తన పని సులువు అవ్వడం కోసం లేదా పిల్లాడు ఏడవకుండా ఉండడం కోసం చేతిలో స్మార్ట్‌ఫోన్ పెడుతోంది. ఆ ఫోన్లలో పిల్లలు ఏం చూస్తున్నారు?
భయంకరమైన హింస
అశ్లీలత వికృత చేష్టలు
క్షణికావేశాన్ని పెంచే గేమ్స్ మరియు వీడియోలు
ఇవి చిన్నారి మెదడులను తీవ్రమైన మానసిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. లేత ప్రాయంలోనే వికృత ఆలోచనలకు బీజం పడుతోంది.
సమయం మించిపోలేదు సరిదిద్దుకుందాం
నేడు సమాజంలో తిరుగుతున్న ప్రతి పది మందిలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక వికారంతో బాధపడుతున్నారు. దీన్ని మనం ఇప్పుడే సరిదిద్దకపోతే రాబోయే రోజుల్లో సమాజం పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయం.

మార్పు ఎక్కడ రావాలి?

తల్లిదండ్రుల పెంపకంలో గారాబం తగ్గించి తప్పు చేస్తే మందలించే ధైర్యం తల్లిదండ్రులకు ఉండాలి. పిల్లలకు భయభక్తులు నేర్పాలి. సమాన పెంపకం కూతురిని ఎలా పెంచుతున్నారో కొడుకును కూడా అంతే బాధ్యతగల పౌరుడిగా నైతిక విలువలతో పెంచాలి. డిజిటల్ డిటాక్స్ పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వదిలేయకుండా వారు ఏం చూస్తున్నారో గమనించాలి. ప్రకృతిని పుస్తకాలను పరిచయం చేయాలి. మనిషిని మనిషిగా బతకనిద్దాం నైతిక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మిద్దాం.

*వ్యాసకర్త*
గొట్టుముక్కుల సమ్మి రెడ్డి
కరీంనగర్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!