- మాజీ సర్పంచ్ వెంకటయ్య అరెస్టుపై బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం
తలకొండపల్లి, నవంబర్ 23 (చైతన్యగళం): గ్రామ సమస్యలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు అని, అలాంటి ప్రశ్నలు అడిగిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడం సరైన పద్ధతి కాదని బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గ్రామ సమస్యలను ప్రస్తావించిన మాజీ సర్పంచ్ వెంకటయ్యపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కార్యాలయాలను మంజూరు చేస్తున్న నేపథ్యంలో తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి గ్రామానికి కూడా నూతన పీఏసీఎస్ కార్యాలయం మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై గ్రామస్థులతో కలిసి మాజీ సర్పంచ్ వెంకటయ్య సమావేశం ఏర్పాటు చేసి, గ్రామానికి పీఏసీఎస్ కార్యాలయం మంజూరయ్యేలా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ చూపాలని కోరినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎమ్మెల్యే కాదని, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతినిధి అని ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడిన మాజీ సర్పంచ్ వెంకటయ్యపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, సమస్యలను ప్రస్తావించే ప్రజల గొంతుకను అణచివేయాలని చూడటం సరికాదని విమర్శించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి, గ్రామానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల మంజూరు వంటి అంశాలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తూ వెళ్తే, రేపు నియోజకవర్గంలోని ప్రజలందరిపైనా కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజల ఆకాంక్షలను గౌరవించి, గట్టిప్పలపల్లి గ్రామానికి పీఏసీఎస్ కార్యాలయం మంజూరయ్యేలా చొరవ తీసుకోవాలని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కృష్ణయ్య, కొండల్, కృష్ణ, పురుషోత్తం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

