- తెలంగాణ నీటి హక్కుల కోసం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తాం: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి, నవంబర్ 23 (చైతన్యగళం):
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా మళ్లిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందకుండా చేసి ఇతర రాష్ట్రాలకు నీటిని తరలించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా జలాల వినియోగంపై బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయమైన వాటాను కాపాడుకోవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నీటి తరలింపును వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర జలహక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలే తమ పార్టీకి ప్రథమ ప్రాధాన్యమని, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును కాపాడుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని జైపాల్ యాదవ్ స్పష్టం చేశారు.

