Tuesday, November 24, 2026
Homeతెలంగాణజర్పుల తండాలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై విచారణ జరిపించాలి

జర్పుల తండాలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై విచారణ జరిపించాలి

📰 Generate e-Paper Clip

  • మహిళా సర్పంచ్‌ను పక్కనపెట్టి ఆమె భర్త పెత్తనం చెలాయించడం ఎంతవరకు సమంజసం?

మాడుగుల, నవంబర్‌ 23 (చైతన్యగళం): జర్పుల తండా గ్రామపంచాయతీలో నిర్వహించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రభుత్వ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్‌ వివాదంపై అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు జర్పుల విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ఓట్లతో ఎన్నికైన మహిళా సర్పంచ్‌ ఉండగా, ఆమె భర్త, అర్కపల్లి రేషన్‌ డీలర్‌ ప్రభుత్వ కార్యక్రమంలో తానే సర్పంచ్‌నంటూ మాట్లాడినట్లు వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రత్యేక అధికారి కేతన్‌, గ్రామ కార్యదర్శి సమక్షంలోనే రేషన్‌ డీలర్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో రేషన్‌ డీలర్‌ ఆధిపత్యం చెలాయించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్‌ ద్వారా ఎన్నికైన సర్పంచ్‌కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హోదా, అధికారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సర్పంచ్‌ భర్త పేరుతో గ్రామపంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధిని పక్కనపెట్టడం వంటి ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు.

గ్రామంలో అభివృద్ధి పనులు ఎవరి వ్యక్తిగత కృషితోనో కాకుండా ప్రభుత్వ నిధులు, అధికారిక విధానాలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జరుగుతాయని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామపంచాయతీ ఎవరి వ్యక్తిగత సంస్థ కాదని, అది ప్రజలందరికీ సంబంధించిన స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ అని స్పష్టం చేశారు.

జర్పుల తండాలో జరిగిన సంఘటనపై ఎంపీడీవో, పంచాయతీరాజ్‌ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి నుంచి వివరాలు సేకరించి, కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, గ్రామపంచాయతీ ప్రోటోకాల్‌, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జర్పుల విజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!