తిరుమల, నవంబర్ 11 (చైతన్యగళం):
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో సర్వదర్శనం క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని ఉచిత సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనం లభించేందుకు సుమారు 20 గంటల సమయం పడుతోంది.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం కేంద్రాల్లో నవంబర్ 11వ తేదీకి సంబంధించిన ఉచిత దర్శన టోకెన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం టోకెన్ల నిల్వ సున్నాగా ఉంది.
ఈ నెల 13న నాగుల చవితి సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేష వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 16న నిర్వహించనున్న వార్షిక పుష్పయాగానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉండగా, నిన్న శ్రీవారిని 78,085 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరింది. 26,232 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.83 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.34 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. అశ్విని ఆసుపత్రిలో 2,782 మంది వైద్య సేవలు పొందారు.
