కపాస్ క్రాంతితో రైతులకు అదనపు ఆదాయం
హుస్నాబాద్, నవంబర్ 5 (చైతన్యళం):
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కపాస్ క్రాంతి’ పథకం ద్వారా పత్తి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని మండల వ్యవసాయ అధికారి పూజ తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలో పంటను పూర్తి చేసుకుని, తదుపరి పంట సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.
గురువారం మండలంలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నూజివీడు సీడ్స్‌కు చెందిన అర్మిత పత్తి పంటపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో పూజ మాట్లాడుతూ.. గత వానాకాలంలో కపాస్ క్రాంతి పథకంలో భాగంగా అర్మిత రకం పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని తగ్గించడంతోపాటు దిగుబడి, ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఈ సాగు విధానానికి స్వల్పకాలిక అర్మిత బీటీ-2 రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంట ఎదుగుదలను నియంత్రించి, పూత, కాయలు సమానంగా ఏర్పడేందుకు మేపిక్వాట్ క్లోరైడ్ మందును విత్తిన 45, 60, 80వ రోజుల్లో మూడు విడతలుగా పిచికారీ చేయాలని వివరించారు. దీనివల్ల పెద్ద పరిమాణంలో కాయలు ఏర్పడటంతోపాటు పత్తి తీత సులభమవుతుందన్నారు.
నవంబరులోనే సుమారు 90 శాతం పంట చేతికి వస్తుందని, మిగిలిన పంటను డిసెంబరు నాటికి పూర్తిగా తీసుకోవచ్చని తెలిపారు. కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. రైతులంతా ఈ సాగు విధానాన్ని అవలంబించి తక్కువ సమయంలో పత్తి పంటను పూర్తి చేసుకుని, తదుపరి పంట సాగు ద్వారా అదనపు ఆదాయం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్ కుమార్, కంపెనీ ప్రతినిధులు టెరిటరీ సేల్స్ మేనేజర్ నీల రాజు, ఎండీవో లెమన్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

