- రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి
ఎల్కతుర్తి, నవంబర్ 4 (చైతన్యగళం):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, ఎల్ఎస్సీఎస్ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఐకేపీ (సెర్ప్), ఎల్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వారు ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఏఎంసీ, ఎల్ఎస్సీఎస్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
