Monday, November 2, 2026
Homeతెలంగాణకరీంనగర్డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం - మేయర్ కొలగాని శ్రీనివాస్

డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం – మేయర్ కొలగాని శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 10 (చైతన్యగళం):

దశాబ్దాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డు చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి డంపింగ్ యార్డును సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. డంపింగ్ యార్డులో చెలరేగుతున్న మంటలు, పొగను అదుపు చేసేందుకు అక్కడే ఉండి అధికారులతో తక్షణ చర్యలు చేపట్టారు. మున్సిపల్ వాటర్ ట్యాంకర్లకు మోటార్ ప్రెషర్ పంపులను అమర్చి మంటలను అదుపు చేయించారు. పూర్తిస్థాయిలో మంటలు, పొగను ఆర్పేందుకు సిబ్బందిని బృందాలుగా నియమించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. గత 40 నుంచి 50 ఏళ్లుగా డంపింగ్ యార్డులో ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని, దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పొగ, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డంపింగ్ యార్డు సమస్యకు ముగింపు పలకడమే తమ పాలకవర్గం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. త్వరలోనే బయోమైనింగ్ ప్రక్రియకు సంబంధించి నాలుగు యంత్రాలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలో దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా తొలగిస్తామని అన్నారు. ప్రతిరోజూ 150 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుండటంతో ప్రక్షాళన ప్రక్రియ కొంత ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. బండి సంజయ్ కుమార్ సహకారంతో మరో రూ.20 కోట్లు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.

బండి సంజయ్ కుమార్ చొరవతో కరీంనగర్ నగరపాలక సంస్థను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకంలో చేర్చి రూ.840 కోట్ల నిధులు మంజూరయ్యాయని మేయర్ తెలిపారు. ఇందులో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద రూ.80 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు ప్రతిరోజూ వచ్చే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా ఏడాదిన్నర కాల వ్యవధిలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నిధులు సమకూర్చామని, త్వరలోనే డంపింగ్ యార్డు సమస్యకు ముగింపు పలుకుతామని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, నగరంలో పారిశుధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు తమ పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాసం గణేష్, పిపిఏ చంద్ర, తోట అనిల్, మేకల వెంకటేష్, పాడిశెట్టి వసంత లక్ష్మీ భూమయ్య, నాయకులు బండారి గాయత్రి, వెంకట్ రెడ్డి, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!