విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులకు పోలీసులకు ముందస్తు సమాచారం తప్పనిసరి: ఏసీపీ సదానందం
హుస్నాబాద్, అక్టోబర్ 10 (చైతన్యగలం):
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, మండపాల నిర్వాహకులు పోలీసుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
దుర్గాదేవి విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులు నిర్వహించదలచిన నిర్వాహకులు తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా ముందస్తు సమాచారం అందించడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఇంటిమేషన్ ఫారాలను సమర్పించాలని స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటు సందర్భంగా రహదారులు, కాలిబాటలు, ప్రజలు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ కనెక్షన్ల కోసం సంబంధిత శాఖ అధికారుల అనుమతులు పొందాలని తెలిపారు. షార్ట్ సర్క్యూట్, అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లను వినియోగించరాదని పేర్కొన్నారు. ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు, వివాదాస్పద పాటలు, ప్రసంగాలకు తావివ్వకూడదని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, నిర్ధారణ కాని వార్తలు, సందేశాలు, వీడియోలను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని తెలిపారు. ప్రతి మండపం వద్ద బాధ్యతాయుతమైన వాలంటీర్లను నియమించుకుని, వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందజేయాలని సూచించారు. దుర్గాదేవి మండపాల వద్ద లక్కీ డ్రాలు, బహుమతుల పేరుతో స్కీములు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
ఉత్సవాల సందర్భంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఏసీపీ సదానందం కోరారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
