సిద్దిపేట, అక్టోబర్ 1 (చైతన్యగళం):
ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓటర్లను నోటీసులు, అవసరమైన పత్రాల కోసం కార్యాలయాలకు పిలవరాదని, బీఎల్‌ఓలు ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసి, పత్రాలను అక్కడే స్వీకరించాలని సూచించారు. సాధారణంగా హియరింగ్ కోసం కార్యాలయాలకు పిలవరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో విచారణ నిర్వహించాలని తెలిపారు.
కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6తో పాటు డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని సీఈఓ స్పష్టం చేశారు. ఈఆర్ఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై ఫారం-6, ఫారం-7కు సంబంధించిన పెండింగ్, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఫారం-6, పెండింగ్ నోటీసులు, ఫారం-7, ఫారం-8 వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను పారదర్శకంగా, మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
