- వైద్యాధికారులు, నోడల్ అధికారులు సమష్టిగా పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రవి రాథోడ్
మహబూబాబాద్, అక్టోబరు 1 (చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు, నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కుష్టు వ్యాధి నోడల్ అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కుష్టు వ్యాధి బృందం ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కుష్టు వ్యాధి వైద్యాధికారి డాక్టర్ సుష్మతో కలిసి నివేదికలు, రికార్డుల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
జిల్లాలో గుర్తించిన 64 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు బహుఔషధ చికిత్స మందులను సకాలంలో అందించాలని డాక్టర్ రవి రాథోడ్ ఆదేశించారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు.
కుష్టు వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసి జిల్లాను వ్యాధి రహితంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
