సిద్దిపేట, సెప్టెంబర్ 25(చైతన్యగలం):
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన ఆయా గ్రామాల నిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. శుక్రవారం ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్‌పల్లి పరిధిలో గల మల్లన్న సాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల ఆర్‌అండ్‌ఆర్ కాలనీల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు, ఇళ్ల స్థలాలు, ఇతర పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సంబంధిత బడ్జెట్ మంజూరు కాగానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం అందించాల్సిన ప్రయోజనాలు అర్హత మేరకు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కొండపోచమ్మ సాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో చెరువు పక్కన నిర్మాణాలు చేపడుతున్నారని, చెరువు ఎఫ్‌టీఎల్ బౌండరీలను ఫిక్స్ చేయాలని, దీనికి ఆనుకొని ప్లాట్లు చేయకూడదని ములుగు తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్వాసితుల పునరావాసం కోసం భూసేకరణ చేసి ఎవరికీ కేటాయించకుండా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టని భూములను వెంటనే అధీనంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా, ఎలాంటి పంటలు వేయకుండా ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, ఆయా మండలాల తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
